Friday, February 29, 2008

యుద్ధ కాలే....

నానా పాటేకరు ఓ పాటలో అంటాడు - " వీడికి జలుబూ, దగ్గూ, మలేరియా చెయ్యలేదు" (ప్రేమలో పడ్డట్టున్నాడు) " లవేరియా" చేసిందీ అని. ఇంచు మించు నా పనీ అలానే వుంది. తెలుగులో పట్టుమని ఓ పది వాక్యాలు నేరాసినతరువాత, గోదారమ్మకీ, కృష్ణమ్మకీ రెండేసి పుష్కరాలు కూదా వచ్చేయి. కాలక్రమేణా, పొట్ట చేత్తో పట్టుకుని, నివాసుణ్ణి కాస్తా ప్రవాసుణ్ణి అయ్యేక - తెలుగు ఇంట్లోనూ, బుర్రలోనూ మాట్లాడుకోవడానికి తప్ప వినియోగించింది లేదు. కాకపోతే అప్పుడప్పుడూ, వార్తా పత్రికలు చదవడమూనూ. దాని కి తోడు ఫోన్లు సులువు అయ్యేక, ఉత్తరాలు ఉట్టినే రాలిపోయేయి. మా తండ్రిగారు, మా తాతగారికి రాసిన దాంట్లో వెయ్యోవంతు కూడా నేను మా నాన్నగారికి రాసి వుండను.

ఖాళీగా పడేస్తే కసాయివాడి కత్తి కూడా కిలం ఎక్కిపోదూ! ఎంత చెడ్డా తెలుగు వాడిని కదా ! తెలుగు నాడు లోంచి బయట పడ్డా, తెలుగులోంచి మాత్రం బయటకి రాలేదు. బడాయి కబుర్లు, నాలోంచి తెలుగు బయటకి వచ్చి వెలిగించిందీ ఏమీలేదు. శారదమ్మ సరస్వతీ నదిలా అంతర్వాహినిగా వుండిపోయింది.

మా తండ్రి గారు, ఒళ్లో కూచోబెట్టుకుని, వెండి కంచంలో, బియ్యపు గింజల మీద బాల్యంలో ద్దిద్దించిన ఓనమాల తరువాత, దేశం వెళుతూ, ఇటు దిగిన పెద్ద చెల్లెలు, పక్కన కూచుని, ఈ మీటల బల్ల మీద మరో సారి అక్షరభ్యాసం చేయించింది.

దాంతొ, ఈ రాయాలనే జ్వరం పట్టుకుంది. కానీ, నా దగ్గరేముంది, వినిపించడానికి, సరుకూ లేదు, స్వరమూ లేదు. నెమరు వేసుకోవడానికి బోలెడు జ్ఞాపకాలు మాత్రం వున్నాయి. అస్పష్టమైన, అతకని ఆలోచనలకి అక్షర రూపం ఇవ్వాడానికి, సాహిత్యమ్మీద పట్టూ, కాస్త అభినివేశమూ వుండాలి.

తెలుగు బ్లాగు రంగంలో ముచ్చటగా, మనసుకు హత్తుకునేటట్టు రాసే హేమాహేమీలు ఎందరో వున్నారు. కనీసం మామూలు సైకికుడిలాగానైనా బ్లాగు రంగంలో దూసుకుపోవాలనీ, అస్త్ర విన్యాసం చేయాలనీ అభిలషిస్తేనే సరిపోతుందా? వాక్య నిర్మాణమే ఇంకా నేర్చుకుంటున్న నేను, జ్వర ప్రకోపం మీద, ఘంటం పట్టుకుని గడిలోకి దూకాలనుకోవడాన్ని చూస్తే అనిపిస్తోంది -" యుద్ధ కాలే శస్త్రాభ్యాసం" అని.

13 comments:

రాఘవ said...

మీరన్న విధానం చూస్తూంటే మీరక్షరాభ్యాసాన్నెప్పుడో ముగించేసి వుంటారనే అనిపిస్తుంది :)

Unknown said...

మీ వాచకం చాలా బాగుంది. మంచి టపాలు మాకందించగలరు.

Anonymous said...

మీ తెలుగు నుడికారాన్ని చదువుతోంటే మీరు అక్షరాభ్యాసం నాడే ఆవకాయ కూడా తినేసినట్లున్నారు. ఇక మీ టపాల మృష్టాన్న భోజనం మాకు వడ్డించడమే తరువాయి! :- )

Anonymous said...

చక్కటి తెలుగులో రాశారు. మీకేం బాగా రాస్తారు.కానివ్వండి.

teresa said...

ఎలాగొ లవేరియా జ్వరం పట్టుకుందిగా, అది ప్రకోపించి frequent గా వచ్చే chills లోంచి మీ ఘంటం వడివడిగా కదులుగాక. ప్రారంభం బాగుంది!

Anonymous said...

యుద్ద ఘంటికలు బాగానే మ్రోగాయి. వీళ్ళందరూ చెప్పినట్టు, మీ వాచకం బాగుంది. శైలీ బాగుంది. త్వరలోనే మంచి టపాలు చూస్తామన్న మాట.

రాధిక said...

ఇంత బాగా రాస్తూ అలా అంటారేమిటండి.ఈ ఒక్క టపా చదివి ఈ తరువాతి టపాల కోసం ఎదురు ఊస్తున్నానంటే అర్ధం చేసుకోండి.

నిషిగంధ said...

చాలా చక్కగా రాశారండి.. ఇక ఖాళీ దొరికినప్పుడల్లా మీటల బల్ల ఎక్కేయండి :)

pruthviraj said...

చిన్నమయ్యగారు కామెంట్ చదివాను. నాకు అంత ఆశాజనకంగా రాసి ముగించాలని పెద్దగా అనిపించలేదు ఆ సమయంలో. నేను నా కవితా తీరు మార్చుకొవాలి ఎంతైనా..వుంటాను.
www.pruthviart.blogspot.com

Naga said...

చాలా బాగా రాసారు. కొనసాగించండి.

Ramani Rao said...

మీ భావ ప్రకటన, బాష అధ్బుతం. అన్నప్రాస్న రోజే పిట్జాలు, బర్గర్లు (మనూర్లో లేరుగా మీరు అందుకనే ఆవకాయి బదులు) తినిపించినట్లుంది. ఫిబ్రవరి నుండి ఏమి బ్లాగభ్యాసం??

sujana said...

ఆంధ్రులు ఆరంభసూరులు అనే నానుడి నిజం చేయకండి!!!!

sujana said...

ఆంధ్రులు ఆరంభసూరులు అనే నానుడి నిజం చేయకండి!!!!