Tuesday, July 15, 2008

ఫిలిప్పీన్సు యాత్రా విశేషాలు

క్రిందటి టపాకి కొనసాగింపు. రమారమీ, పాతికేళ్ల క్రితం ఈనాడు రామోజీరావు, సుధా చంద్రన్ అనే నటి నాయికగా "మయూరి" అనే విజయవంతమయిన చిత్రాన్ని నిర్మించేరు. ఇందులో నాయిక, నిజ జీవితంలో కూడా, ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. ఆమె ఎంతో ఆత్మ స్థైర్యంతో, మొక్కవోని పట్టుదలతో, కృత్రిమ పాదం అమర్చుకుని, నొప్పి సహించి, నాట్యపు పోటీలో గెలుపొందడం టూకీగా ఈ చిత్ర కధ. ఆ కృత్రిమ పాదం రూపొందించి, అమర్చిన వైద్యుడు డా. ప్రమోద్ కరణ్ సేథీ (వీరు ఈ మధ్యే ఓ ఆరు నెలల క్రితం కాలం చేసేరని చదివేను). ఆ కాలు పేరు "జైపూరు పాదం". "ఈ పాదం నటరాజుకే ప్రమోదం" అన్న పాట జ్ఞాపకం వుండే వుంటుందికదా!

గత వారం, కంపెనీ పని మీద, ఫిలిప్పీన్సు దేశపు రాజధాని మనీలా నగరానికి వెళ్లి ఓ నాలుగు రోజులు బస చేసేను. ఇక్కడ (యుఏఈ లో) రోజూ ఎంతో మంది ఫిలిపినాలూ (అంటే ఫిలిప్పీను దేశస్థులు) తారసపడ్డా, అక్కడికి (ఫిలిప్పీన్సు) వెళ్లేక వారి పట్ల నా గౌరవం ఇనుమడించింది. నేను గమనించిన కొన్ని విషయాలు ముచ్చటిస్తాను.

1. మన దేశంలో రూపాయి, పైసలూ అంటామా - వాళ్లు "పెసో" లు, సెంట్లు అంటారు. రూపాయీ, పెసో ల మారకం ఇంచుమించు సమానం. రు.43/- = 1 అమెరికా డాలరు = 45.25 పెసోలు.

2. వాళ్లందరూ నాకు శాంత స్వభావుల్లా కనిపించేరు. ఏదైనా దుకాణానికి వెళ్లి, బేరం చేసి, నచ్చక తిరిగి వెళ్లిపోతున్నారనుకోండి- మిమ్మల్నేమీ ఒత్తిడి చెయ్యరు. అదే ముంబయి నగరంలో సీ.ఎస్.టీ. స్టేషను దగ్గరి మార్కెట్టులో, పొరపాటున కొట్టు కేసి చూస్తే చాలు - మిమ్మల్ని రక్కి మీ జేబు ఖాళీ చేసేదాక ఊరుకోరు.

3. ముష్టివాళ్లూ నాకెక్కడా అగుపించలేదు. హోటలు దగ్గర మాత్రం సాయంకాలమప్పుడు, ఏడెనిమిదేళ్ల లోపు పిల్లలు కాళ్లకడ్డం పడిపోతుంటారు. వెనక పెద్దవాళ్లెవరో వుండి నడిపిస్తుంటారనుకుంటాను. ఈ వ్యవహారం నేను చైనా లో కూడా గమనించేను.(క్రిందటి అక్టోబరులో చైనా దక్షిణ భాగంలో వున్న గ్వాంగ్జూ నగరాన్ని దర్శింఛేను. అప్పటికింకా తెలుగు బ్లాగులు నాకెరుక లేదు కాబట్టీ, మిమ్మల్నెవర్నీ విసిగించలేదు.)హోటలు గది నుంచి మెట్రో మనీలా

4. కుర్రకారు అమ్మాయిలూ, అబ్బాయిలూ, చెట్టపట్టాలేసుకుని రోడ్ల వెంబడి తెగ తిరుగుతూ వుంటారు. కానీ, కుచేష్టలు నా కంట బడలేదు. అమ్మాయిలు కురచ బట్టలు వేసుకుని వీధుల్లో తిరిగినా, వాళ్ల మానాన వాళ్లు పోవడం చూసేను. "ఈవ్ టీజింగ్" చాయలు నా దృష్టికి రాలేదు.

5. పెద్ద, పెద్ద షాపింగు మాళ్లూ, ఫాస్టు ఫుడ్డు జాయింట్లూ, పబ్బులూ, డిస్కోతెక్కులూ - యువతకి గేలాలు. వీటన్నిటి నడుమ, పేపర్లో యోగ శిక్షణా శిబిరాల గురించిన వర్గీకృత ప్రకటనలూ వుంటాయి. ఇవి కాక, నానా గడ్డీ తిని, బరువు పెరిగిన వాళ్ల ఊబకాయాన్ని త్వరిత గతిన (క్విక్ ఫిక్సు పద్ధతి లో)తగ్గించడం - ఒక పెద్ద వ్యాపార విషయం.

6. అన్నిటి కంటే, నాకు నచ్చినదేమిటంటే - దాదాపు అందరూ ఒక స్థాయిలో, మనకు అర్ధమయ్యేటట్టు ఆంగ్లంలో మాట్లాడగలగడం. భావ వ్యక్తీకరణ అక్కడ నాకెప్పుడూ సమస్య కాలేదు. టేక్సీ చోదకులూ, విక్రేతలూ, సామాన్య జనాలతో, ఇబ్బంది లేకుండా మాట్లాడొచ్చు. అదే చైనా లో అయితే, హోటలు దాటితే, మనదంతా మూకీ సినిమా టైపు. హోటల్లో బయలుదేరేముందు, ఎక్కడికి వెళ్లాలో చెప్పి కాంటొనీసు భాషలో రాయించుకుని, అది టేక్సీ చోదకుడికి చూపి, తిరిగొచ్చేప్పుడు హోటలు కార్డు చూపి రావాలి. చైనాలో టేక్సీ ప్రయాణంలో పలకరింపుల నవ్వులు తప్పించి - మాటలు నాస్తి. మనీలా లో టేక్సీ చోదకుడిని కదిపితే, దారి పొడుగునా, గల గల మంటూ ఎన్నొ కబుర్లు చెబుతాడు.

ఇదిలా వుంచి, అసలు విషయానికొస్తే, నేను బస చేసిన హోటలుకి మూడు భవనాల తరువాత వున్న రమోన్ మెగ్సెసే ఫౌండేషన్ దర్శించేను. కీ.శే. రమోన్ మెగ్సెసే, ఓ మూడున్నరేళ్లపాటు, ఫిలిప్పీన్సు దేశాధ్యక్షుడిగా చేసి, 49 ఏళ్ల పిన్న వయసులో, 1957 లో, ఒక విమాన ప్రమాదానికి బలి అయిపోయాడు. రమోన్ మెగ్సెసే మరణానంతరం, అతడి పేరు మీద న్యూ యార్కు నగరంలోని రాక్ఫెల్లర్ సోదరుల నిధి వారు, ఈ బహుమతిని ఫిలిప్పీన్సు ప్రభుత్వ సహకారంతో, 1957 నుంచీ ప్రతీ ఏటా ఆసియా ఖండంలో ఈ క్రింది ఆరు రంగాలలో ప్రజలకి ఉత్కృష్టమైన సేవలందించిన వ్యక్తులకి అందజేస్తున్నారు. దీనిని ఆసియా నోబెల్ బహుమతిగా గుర్తిస్తారు.రమోన్
మెగ్సెసే ఫౌండేషన్ లో వారి విగ్రహం

1. ప్రభుత్వ రంగంలో విశిష్ట సేవ
2. సమాజ సేవ
3. సమాజ నాయకత్వం
4. జర్నలిజం, సాహిత్యం మరియూ సృజనాత్మక కళలూ
5. శాంతీ మరియూ అంతర్జాతీయ సహృద్భావన
6. నవ నాయకత్వం

నేను మొదటి సారి ఈ పురస్కారం గురించి విన్నది "మయూరి" చిత్రం విషయంలోనే! అప్పట్లో మెగ్సెసే పేరు పలకడం గొప్ప కష్టంగా వుండేది. కీ.శే. డా. ప్రమోద్ కరణ్ సేథీ కి ఈ పురస్కారం 1981 లోనే లభించింది. సినిమాల ద్వారా విషయ పరిజ్ఞానం (జనరల్ నాలెడ్జి) పెంచుకునే నాకు 1984 వరకూ తెలియరాలేదంటే అతిశయోక్తి కాదు. అలా ఈ చిత్రం ద్వారా పెరిగిన ఆసక్తి, గడచిన సంవత్సరం తెలుగువాడయిన పాలగుమ్మి సాయినాధ్ కి లభించినప్పుడు - మరింత ఎక్కువయ్యింది.


పాలగుమ్మి సాయినాధ్ (మెగ్సెసే ఫౌండేషన్ లో క్లిక్కుమనిపించినది)

ఈ పురస్కారం ఏర్పాటు చేసినప్పటినుంఛీ, అత్యధిక పర్యాయాలు అందుకున్న దేశం మనదే! మొత్తం నలబై ముగ్గురు వ్యక్తులు మన దేశం నుంచీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మొదటి తెలుగు వ్యక్తి పాలగుమ్మి సాయినాధ్. ఈయన మాజీ రాష్ట్రపతి కీ.శే. వీవీ గిరి మనవడు. ఈ అవార్డు అందుకున్న వివిధ దేశాల జాబితా అకార క్రమం లో కింద పొందు పరచేను. ఆసియా ఖండేతరులకి, వారు ఆసియా లో అందించిన సేవలని పురస్కరించుకుని ఈ బహుమతి ప్రదానం చేయబడింది.

1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు - 9 మంది
2. ఆఫ్ఘనిస్తాన్ - 1 రు
3. ఇండోనేషియా - 18 మంది
4. ఐర్లేండు - 1 రు
5. కంబోడియా - 3 రు
6. చైనా - 12 మంది
7. డెన్మార్క్ - 1 రు
8. బంగ్లాదేశ్ - 7 మంది (మహమ్మద్ యూనస్ 1984 లో మెగ్సెసే పురస్కారాన్ని, 2006 లో నోబెల్ బహుమతినీ అందుకున్నారు)
9. ఫిలిప్పీన్సు - 32 మంది
10. ఫ్రాన్సు - 1 రు
11. బ్రిటను - 10 మంది
12. భారత్ - 43 మంది (మదర్ తెరెసా ని 1962 లో మెగ్సెసే అవార్డు గౌరవించగా, 1979 లో నోబెల్ బహుమతీ, 1980 లో భారతరత్న అలంకరించేయి)
13. మియాన్మార్ - 3 రు

నేను ఫౌండేషను దర్శించినప్పుడు, అక్కడి ఉద్యోగస్తులందరూ ఎంతో ఆదరణతో నాకు అక్కడి విషయాలు తెలియజేసేరు. 2008 పురస్కార ప్రదానాల గురించి వారంతా ఎంతొ బిజీ గా ఉన్నట్టనిపించింది. ప్రతీ ఏడాదీ, మెగ్సెసే జన్మ దినాన అంటే ఆగస్టు 31 న వీటిని ప్రదానం చేస్తారు.

మరోసారెప్పుడైనా మిగతా యాత్రా విశేషాలు రాస్తాను.

Saturday, July 12, 2008

చెప్పుకోండి చూద్దాం

తెలుగువారు కాని ఈ క్రింది వారిలో సారూప్యం పోలిక పట్టగలరా? ఒక్క తెలుగాయన్ని కలుపుకుంటే మొత్తం నలబై ముగ్గురు లబ్ధ ప్రతిష్ఠులైన బారతీయులు. కేవలం అయిదు మందిని మాత్రం ఉటంకిస్తున్నాను.

1. రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్
2. కిరణ్ పేష్వారియా బేడీ
3. కీ.శే. ప్రమోద్ కరణ్ సేథీ
4. తిరునెల్లై నారాయణయ్యర్ శేషన్
5. వర్ఘీస్ కురియన్

ఆ తెలుగాయన పేరు చెబితే మరీ సంతోషం.

ఈ విషయం మీద వచ్చే టపా కాస్త వివరంగా.