Friday, February 22, 2008

పేరులోనేమున్నది పెన్నిధి ?

పేరులోనేమున్నది పెన్నిధి అనుకుంటాము గాని, ఏమున్నా లేకపోయినా, కొన్ని పేర్లలో మటుకు గొప్ప చమత్కారం వుంటుంది. సరదాగా కొన్ని జనావాసాల పేర్లు, కొన్ని వస్తువుల పేర్లు ముందుంచుతాను. ఆయా ప్రాంతాలలో వుండి చదువుకునేటప్పుదు, తోటి పిల్లల సహవాసం లో విన్నవీ, సేకరించినవీ, ఇంకా ఙ్ఞాపకమున్నవీ ఈ కొన్ని. ఇవేవీ నా సొంతం కావు.

1.
స్టోనుహౌసు పేట

నెల్లూరులో స్టోనుహౌసు పేట అనే చోటు వుంది. ఆ ప్రాంతమంతా ఎరువులూ, పప్పు దినుసుల టోకు వ్యాపార కేంద్రం కావడంతో బాటు, వణిక్ప్రముఖుల ఆవాసమూనూ. మనుమసిద్ధి మహారాజావారు గట్టి రాతి భవనాలు నిర్మించి వుంటారనీ, ఆంగ్లేయుల కాలంలో ఈ చోటు నామ రూపాంతరం చెంది స్టోనుహౌసు పేట గా మారి వుంటుందనీ చాలా మంది నాకు చెప్పేవారు. కానీ, మచ్చుకైనా ఓ రాతి కట్టడమో, లేక దాని శిధిలమో కూడా ఎక్కడా కనిపించలేదు. పోనీలే, భూమిలో కప్పబడిపోయి వుంటాయి అనుకుంటే, పేరుని సగం మాత్రమే అనువదించి "పేట" అనే తెలుగు మాట ని ఎందుకు వదిలేసెరు అనే సందేహం నన్ను పీడిస్తూ వుండేది. తిక్కన మీది గౌరవమనో, మొల్లమ్మకి పురస్కారమనో కొంతమందంటే, మరింత ముందుకెళ్లి కొందరు శ్రీ పొట్టి గారి సంస్మరణార్ధమనేమోనని వివరించేవారు. చివరకు తేలిందేమిటంటే, శ్రీమాన్ స్టోనుహౌసు వారు నెల్లూరు జిల్లాకి ఆంగ్లేయుల హయాం లో కలెక్టరుగా చేసి, ఎనలేని సేవలందించిన కారణంగా వారిని నిత్యం తలచుకునేటట్లు ఆయన పేరుని పెట్టేరు.

2.
తిరుమల తిరుపతి


అష్ట కష్టాలుబడి, కొండెక్కి, గుండు చేయించుకుని, వెంకన్న బాబుని దర్శించి, ఎండన బడి, సూర్య తాపాన్ని నిగ్రహించడం కోసం తలకి ఓ రుమాలు చుట్టుకుని కాలి దారిన కొండ దిగే యాత్రికులని చూసేవుంటారుగదా! నుదుటి మీదనుంచి గుండు మీదికి పంగనామం పెట్టి డబ్బులు వడుక్కునేవాళ్లని ఎవరెరుగరు? ముందొకడు బొట్టుపెట్టే మిష మీద "తీ రుమాలు" అంటాడు. వాడు చందనం అద్దేక ఇంకొకడు తీక్షణంగా "తీ రూపాయి తీ" అనేవాడట. క్రమంగా ఈ పేర్లు జనం నాలుకల మీద నాని, నాని తిరుమల తిరుపతి గా రూపాంతరం చెందేయని హాస్య పురాణాల్లొ చెప్పేరు.

3.
చపాతీ

మునీశ్వరులవారు, జనానికి దూరంగా ఓ అడవిలో చెట్టుకింద కఠోర తపస్సులో నిమగ్నమయ్యేరు. ఆ అడవిలో వుండే ఓ కోయజాతి బాలుడు రోజూ ఏదో వస్తువు తెచ్చి స్వామి వారికి నివేదించే వాడు. దీని వల్ల ముని గారికి కించిత్తు ఏకాంతభంగం కలిగినా, తననెవరూ పలకరించి, మాటాడించలేదుగదా అని సరిపెట్టుకున్నారు. ఒకసారి ఆ కోయజాతి వారికి కొన్ని గోధుమ గింజలు దొరగ్గా, వాటిని, విసిరి, ముద్ద చేసి, పొయ్యి మీద కాల్చగా తయారైన పదార్థాన్ని చూసి విస్తు పోయారు. దాన్ని సాములోరికి నివేదించేకే తినాలని నిర్ణయించుకున్నారు. ఆ ఖాద్య వస్తువుని ఏమని పిలవాలో కూడా సాములోర్నే అడగాలనుకున్నారు. వారికేంతెలుసు, మునివర్యులు కఠోర తపస్సు చేస్తూ, మౌన వ్రతం అవలంబిస్తున్నారనీ! మన బాలుడు, సదరు వస్తువుని సాములోరికి నివేదించి, ఆయన ఎప్పుడు కళ్లు తెరిచి చూస్తారా అని అక్కడే కూచున్నాడు.


ఈ పిల్లవాడు నిష్క్రమిస్తే, ఆ పెట్టిందేదో ఆరగించి, తన పనేదో చూసుకోవలని, క్రీగంట గమనించిన మునిగారి ఆశ. సాములోరితో మాటాడందే కదలకూడదని కోయబాలుడి పట్టు. ఎదురు చూసీ, చూసి, పిల్లవాడు, వస్తువుని సాములోరి నాసికా పుటాల దగ్గరకు తీసుకొచ్చేడు. మునీశ్వరులవారు భయపడినదంతా అయ్యింది. తపోభంగం కలగడంతో, అసహనంగా "ఛ, పో, తీ" అని గట్టిగా విసుక్కున్నారు. వెంటనే బాలుడు పరుగు లంకించుకుని, గూడెం చేరుకుని తనవారందరికీ, దీని పేరు సాములోరు " చపోతీ" గా నిర్ణయించేరని చెప్పేడు. కాలక్రమేణా, అదే చపాతీ అయ్యింది.

4.
వాల్తేరు

విశాఖపట్నానికి విశాఖ, వైజాగు, వాల్తేరు అని వివిధ సందర్భాలలో పేర్లు. విశాఖ, వైజాగు- విశాఖపట్నానికి భ్రష్ట రూపాలని తెలిసిపోతుంది. మరి వాల్తేరో? ఆలకించండి.


వాల్టు డిస్నీ మహాశయుడు డిస్నీలేండు నిర్మాణంలో ఉన్నప్పుడు ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కొన్నాడు. భవిష్యత్తంతా అగమ్యగోచరమనిపించి ఎంతో నిరుత్సాహానికి లోనయ్యేడు. ఆ సమయంలో సన్నిహిత మిత్రులొకరు, తిరుపతి వెంకన్న బాబు కి తల నీలాలని ఇస్తానని మొక్కితే సమస్యలు సానుకూలమవుతాయని సలహా ఇచ్చేరు. ఎంతో విశ్వాసంతో వాల్టు డిస్నీ కొండలరేడుకి అలాగే మొక్కేడు. వెనువెంటనే, ఇబ్బందులన్నీ దూదిపింజల్లా తేలిపోయి, పని ఓ కొలిక్కి వచ్చింది. ఎంతో సంతోషించిన వాల్టు డిస్నీ వెంటనే భారతదేశం ప్రయాణం అయ్యేడు. మునుపటి రాజధాని కలకత్తా లో విమానం దిగి, అక్కడ విచారించగా హౌరా - తిరుపతి పేసింజరు ఎక్కివెళ్లమని చెప్పేరు. బహుదూరపు విమాన యానం, దానికి తోడు, దుమ్ము ధూళుల మధ్య బొగ్గింజను బండిలో, అన్ని స్టేషన్లలోనూ ఆగుతూ రైలు ప్రయాణం - ఆయన ఒళ్లు హూనం చేసేయి. ప్రతీ స్టేషనులోనూ టీటీఈ ని తిరుపతి ఎప్పుడొస్తుంది, తిరుపతి ఎప్పుడొస్తుందని పదే పదే అడిగేవాడు. వాల్టు డిస్నీ మహాశయుడి ప్రవర తెలియని టీటీఈ కి , ఒక స్థాయిలో చికాకు నషాళానికి అంటింది. వైజాగు రాగానే "ఇదేనయ్యా, తిరుపతి, దిగు" అని టీటీఈ నమ్మబలికేడు. తిరుపతి రూపురేఖలు ఎరుగని వాల్టు డిస్నీ మహాశయుడు, నిజమని భ్రమించి, దిగి బయటకి వెళ్లి సంపూర్ణ వేణీ సంహారం గావించేడు. అప్పుడు ఏలుతున్న తెల్ల దొరలు, ఇతడిని పరిచయం చేసుకోగా వార్త పొక్కింది. "వాల్టు"(డిస్నీ) తన "హెయిరు" (జుట్టు) ను సమర్పించిన చోటు కాబట్టి, నాటి నుండీ, "వాల్టు హెయిరు" గా ప్రసిద్ధికెక్కింది. కాలక్రమేణా, "వాల్టేరు" గానూ, ఆపైన "వాల్తేరు" గానూ ప్రజలు గుర్తించేరు. సదరు టీటీఈ చేసిన మతిమాలిన పనికి రైల్వే శాఖ క్షమాపణ చెప్పి, విశాఖపట్నం స్టేషను కి వాల్తేరు అని పేరు మార్చేరు. మొన్నీ మధ్య వరకూ, ఇదే పేరు చలామణిలో వుండేది. ఇది తెలిసిన వాల్టు డిస్నీ మహాశయుడు, కళ్లు చెమర్చి, తన పేరుని కూడా "వాల్తేరు డిస్నీ" గా మార్చుకున్నాడంటారు.

1 comment:

Anonymous said...

"..సంపూర్ణ వేణీ సంహారం గావించేడు" హ హ హ! నేనెరిగిన ఒక గడుగ్గాయి పిల్లని బళ్ళో ఒక తుంటరి చలపతి తెగ వేధించేవాడు. ఒకరోజు మాష్టారు ముద్దుపేర్ల గురించి పాఠం చెబుతూ, "చలపతి" (వాడు ఆయనకి ప్రియశిష్యుడు!) ని ముద్దుగా, "చలం" అనో "పతి" అనో పిలుచుకోవచ్చు అన్నాడు. మన గడుగ్గాయి వెంటనే "'చపాతీ' అని కూడా అనొచ్చు సార్!" అంది. అంతే! చలపతిని ఆ తరవాత ఒక్కరైనా 'చలపతి' అని కానీ, 'చలం' అని కానీ పిలిస్తే ఒట్టు! :- )