Thursday, February 28, 2008

ఇంకొన్ని పాత సంగతులు

క్రిందటి టపా లోని "చెప్పుకోండి చూద్దాం" కి కొనసాగింపు.

సాధారణంగా ఇలాంటి ప్రశ్నలలో, ఏదో చిన్న మెలిక వుంటుంది. ఈ మెలికే సమాధానాని కి కీలకం. చాలా, చిన్నప్పుడు, బళ్లో, మా తరగతి పిల్లలు, ఎవరైనా కొత్తవాళ్లొస్తే, అడిగేవారు. మూడు ప్రశ్నలు, ఒకటే జవాబు.

1. బట్టలు వుతికి ఏం చేస్తావు?
2 కట్టెలు కొట్టేవాడి గొడ్డలి దేంతో చేస్తారు?
3. అకస్మాత్తుగా పులి తరిమితే ఏం చేస్తావు?

మూడింటికి ఒకటే జవాబు " ఐరన్" - "ఇస్త్రీ, ఇనుము, పరుగు తీస్తాను" అని.

పిల్లల వ్యవహారం గదా, పోనీలే అని సరిపెట్టుకుందామనుకున్నాను. ఎనభయ్యవ దశకంలో, స్వాతి మాస పత్రికలో శ్రీ శ్రీ గారు ఒక క్రాసు వర్డు పజిలు (ఆంధ్రములో పద బంధ ప్రహేళిక) నిర్వహించేవారు. దానికి పోటీగా జ్యోతి మాస పత్రిక లో ఆరుద్ర గారూ ఒక క్రాసు వర్డు పజిలు (వారు దీనికి జాతి తెనుగులో గళ్ల నుడికట్టు అని నామకరణం చేసేరు) నడిపేవారు.

క్రిందటి సంచికలోని శేషాన్ని హరించి, ముందుకు సాగుతాను.

ఒరెమూనా గారు వ్యాఖ్యానించినట్టే, విష్ణువు సదా స్మరించేవారికే ప్రసన్నుడు. స్మరణ అంటే చింతన. చింతించేవాడు చింతకుడు. ఎవరి వల్ల అంటే చింతకుడి వల్ల - అనగా "చింతకాయ". రెండో ప్రశ్న కి వేరుగా సమధానం అక్కరలేదనుకుంటాను.

సరే, మన ఆరుద్ర వారి మాట కొస్తే, ఓ సారి గళ్ల నుడి కట్టులో అడిగేరు. మూడక్షరాల మాట. ఆధారం "ఎటునుంచి చూసినా మంగలి కత్తే".

అక్షరాలతో చిన్న చెడుగుడు ఆడేరు. మీకింకా జ్ఞాపకముందా!

5 comments:

రాఘవ said...

రేజరేనాండీ?

కొత్త పాళీ said...

మీకు గళ్ళ నుడికట్టన్నా మాటలతో ఆటలన్నా కుతూహలం ఉంటే పొద్దు వాళ్ళ గడిని సందర్శించ వలసింది. ఈ మాసపు గడి ఇక్కడ చూడచ్చు.
http://poddu.net/gadi/crossword.php

కొత్త పాళీ said...

ఇందాకటి వ్యాఖ్యలో చెప్పటం మరిచాను .. తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం.

చిన్నమయ్య said...

రాఘవ గారూ, అవును, చక్కగా పోలిక పట్టేరు.

కొత్తపాళీ గారూ, కృతజ్ఞుణ్ణి. కానీ, ఆ గళ్ల నుడి కట్టు నా బోటి వాడికి కాస్త కఠినమే. మీరు సగం నింపిన చిత్తు కొంత దోహదకారి.

GKK said...

మీరు చెబుతున్న సంగతులు బాగున్నాయి. ’చిన్నమయ్య’ అన్న పేరు ఆత్మీయంగా ఉంది. నాకు బాగా నచ్చింది.