Friday, February 29, 2008

యుద్ధ కాలే....

నానా పాటేకరు ఓ పాటలో అంటాడు - " వీడికి జలుబూ, దగ్గూ, మలేరియా చెయ్యలేదు" (ప్రేమలో పడ్డట్టున్నాడు) " లవేరియా" చేసిందీ అని. ఇంచు మించు నా పనీ అలానే వుంది. తెలుగులో పట్టుమని ఓ పది వాక్యాలు నేరాసినతరువాత, గోదారమ్మకీ, కృష్ణమ్మకీ రెండేసి పుష్కరాలు కూదా వచ్చేయి. కాలక్రమేణా, పొట్ట చేత్తో పట్టుకుని, నివాసుణ్ణి కాస్తా ప్రవాసుణ్ణి అయ్యేక - తెలుగు ఇంట్లోనూ, బుర్రలోనూ మాట్లాడుకోవడానికి తప్ప వినియోగించింది లేదు. కాకపోతే అప్పుడప్పుడూ, వార్తా పత్రికలు చదవడమూనూ. దాని కి తోడు ఫోన్లు సులువు అయ్యేక, ఉత్తరాలు ఉట్టినే రాలిపోయేయి. మా తండ్రిగారు, మా తాతగారికి రాసిన దాంట్లో వెయ్యోవంతు కూడా నేను మా నాన్నగారికి రాసి వుండను.

ఖాళీగా పడేస్తే కసాయివాడి కత్తి కూడా కిలం ఎక్కిపోదూ! ఎంత చెడ్డా తెలుగు వాడిని కదా ! తెలుగు నాడు లోంచి బయట పడ్డా, తెలుగులోంచి మాత్రం బయటకి రాలేదు. బడాయి కబుర్లు, నాలోంచి తెలుగు బయటకి వచ్చి వెలిగించిందీ ఏమీలేదు. శారదమ్మ సరస్వతీ నదిలా అంతర్వాహినిగా వుండిపోయింది.

మా తండ్రి గారు, ఒళ్లో కూచోబెట్టుకుని, వెండి కంచంలో, బియ్యపు గింజల మీద బాల్యంలో ద్దిద్దించిన ఓనమాల తరువాత, దేశం వెళుతూ, ఇటు దిగిన పెద్ద చెల్లెలు, పక్కన కూచుని, ఈ మీటల బల్ల మీద మరో సారి అక్షరభ్యాసం చేయించింది.

దాంతొ, ఈ రాయాలనే జ్వరం పట్టుకుంది. కానీ, నా దగ్గరేముంది, వినిపించడానికి, సరుకూ లేదు, స్వరమూ లేదు. నెమరు వేసుకోవడానికి బోలెడు జ్ఞాపకాలు మాత్రం వున్నాయి. అస్పష్టమైన, అతకని ఆలోచనలకి అక్షర రూపం ఇవ్వాడానికి, సాహిత్యమ్మీద పట్టూ, కాస్త అభినివేశమూ వుండాలి.

తెలుగు బ్లాగు రంగంలో ముచ్చటగా, మనసుకు హత్తుకునేటట్టు రాసే హేమాహేమీలు ఎందరో వున్నారు. కనీసం మామూలు సైకికుడిలాగానైనా బ్లాగు రంగంలో దూసుకుపోవాలనీ, అస్త్ర విన్యాసం చేయాలనీ అభిలషిస్తేనే సరిపోతుందా? వాక్య నిర్మాణమే ఇంకా నేర్చుకుంటున్న నేను, జ్వర ప్రకోపం మీద, ఘంటం పట్టుకుని గడిలోకి దూకాలనుకోవడాన్ని చూస్తే అనిపిస్తోంది -" యుద్ధ కాలే శస్త్రాభ్యాసం" అని.

Thursday, February 28, 2008

ఇంకొన్ని పాత సంగతులు

క్రిందటి టపా లోని "చెప్పుకోండి చూద్దాం" కి కొనసాగింపు.

సాధారణంగా ఇలాంటి ప్రశ్నలలో, ఏదో చిన్న మెలిక వుంటుంది. ఈ మెలికే సమాధానాని కి కీలకం. చాలా, చిన్నప్పుడు, బళ్లో, మా తరగతి పిల్లలు, ఎవరైనా కొత్తవాళ్లొస్తే, అడిగేవారు. మూడు ప్రశ్నలు, ఒకటే జవాబు.

1. బట్టలు వుతికి ఏం చేస్తావు?
2 కట్టెలు కొట్టేవాడి గొడ్డలి దేంతో చేస్తారు?
3. అకస్మాత్తుగా పులి తరిమితే ఏం చేస్తావు?

మూడింటికి ఒకటే జవాబు " ఐరన్" - "ఇస్త్రీ, ఇనుము, పరుగు తీస్తాను" అని.

పిల్లల వ్యవహారం గదా, పోనీలే అని సరిపెట్టుకుందామనుకున్నాను. ఎనభయ్యవ దశకంలో, స్వాతి మాస పత్రికలో శ్రీ శ్రీ గారు ఒక క్రాసు వర్డు పజిలు (ఆంధ్రములో పద బంధ ప్రహేళిక) నిర్వహించేవారు. దానికి పోటీగా జ్యోతి మాస పత్రిక లో ఆరుద్ర గారూ ఒక క్రాసు వర్డు పజిలు (వారు దీనికి జాతి తెనుగులో గళ్ల నుడికట్టు అని నామకరణం చేసేరు) నడిపేవారు.

క్రిందటి సంచికలోని శేషాన్ని హరించి, ముందుకు సాగుతాను.

ఒరెమూనా గారు వ్యాఖ్యానించినట్టే, విష్ణువు సదా స్మరించేవారికే ప్రసన్నుడు. స్మరణ అంటే చింతన. చింతించేవాడు చింతకుడు. ఎవరి వల్ల అంటే చింతకుడి వల్ల - అనగా "చింతకాయ". రెండో ప్రశ్న కి వేరుగా సమధానం అక్కరలేదనుకుంటాను.

సరే, మన ఆరుద్ర వారి మాట కొస్తే, ఓ సారి గళ్ల నుడి కట్టులో అడిగేరు. మూడక్షరాల మాట. ఆధారం "ఎటునుంచి చూసినా మంగలి కత్తే".

అక్షరాలతో చిన్న చెడుగుడు ఆడేరు. మీకింకా జ్ఞాపకముందా!

Monday, February 25, 2008

పాత సంగతులు

ఓ రెండు దశాబ్దాల క్రితం కాబోలు గుంటూరు శేషేంద్ర శర్మ గారు, ఆంధ్ర ప్రభ వార పత్రిక లో అడపా దడపా కవిత్వం మీద ఒక శీర్షిక నిర్వహించేవారు. పేరు నాకిప్పుడు జ్ఞాపకం లేదు. అందులో వారు ఈ కింది ముక్తక శ్లోకాన్ని పరిచయం చేసేరు.

ఈ శ్లోకం ఒక కవి రాజాశ్రయం కోరుతూ, రాజుని " రాజాధి రాజ, రాజ మార్తండా... " అంటూ పొగడకుండానూ, తన దురవస్థని కూడా మరీ " మాధవ కబళం పెట్టించండి, మహాప్రభో" అని చెప్పుకోకుండా పని కానిచ్చిన నేపధ్యం లోనిది.

అర్ధం దానవ వైరిణా
గిరిజయాప్యర్థం శివస్యాహృతం
దేవేత్థరం జగతీతలే
పురహరా భావే సమున్మీలతి


తాత్పర్యం ఏమిటంటే

శివుడి దేహంలో సగభాగం మోహినీ రూపంలో విష్ణువు, మిగిలిన సగం పార్వతీ తీసుకోగా, లోకంలో శివుడు లేకుండాపోయాడు. అపుడు శివుణ్ణి ఆశ్రయించిన వాళ్ల గతి ఇలా అయ్యింది. గంగ సాగరాన్ని ఆశ్రయించింది. చంద్రకళ ఆకాశాన్నీ, నాగరాజు భూమినీ ఆశ్రయించారు. ఇక మిగిలిన మూడింటిలో సర్వజ్ఞత, అధీశ్వరత - ఓ రాజా నిన్నాశ్రయించగా, భిక్షాటన నన్ను ఆశ్రయించింది.

భావం పుర్తిగా వెలిబుచ్చినా, శ్లోకం అంతా వారు ప్రస్తావించలేదు. అప్పట్లో నాకు, పరిచయమున్న ఉభయభాషా కోవిదులు కొందరిని శ్లోకపు పూర్తి పాఠాన్ని గురించి అడిగేను. తాము వినలేదన్నారు. ఒక పని మీద శ్రీ తిరుమల రామచంద్ర గారిని కలవడం తటస్థించింది. మాటల సందర్భం లో, వారిని అడిగితే, వెంటనే వారు పూరించేరు.

సర్వజ్ఞతం అధీశ్వరత్వం మగమత్మాం
మాం చ భిక్షాటనం

తరువాత చాలా కాలం వరకూ, నాకు పై విధంగా తెలిసిన పూర్తి శ్లోకాన్నీ, తాత్పర్యాన్నీ ఒక చోట చేర్చి చూసుకోలేదు. ఈ మధ్యే కొన్నేళ్ల క్రితం, పాత కాగితాలు చూస్తోంటే, ఈ రాత ప్రతి కనిపించింది. కానీ శ్లోకంలో పాము, సముద్రాల ప్రస్తావన వున్నట్టనిపించలేదు. నేడు గుంటూరు వారూ, తిరుమల వారూ ఇద్దరూ కీర్తి శేషులే. ఎరిగినవారు తెలియజేస్తే ధన్యుణ్ణి.

మరొక్క మాట

ఎక్కడో చదివిన - రెండు ప్రశ్నలు, ఒకే జవాబు

1. కస్మై ప్రసీదతే విష్ణుః ? (విష్ణువెవరికి ప్రసన్నుడగును?)
2. కిం ఆంధ్రాణమతి ప్రియం? ( ఆంధ్రులకు ప్రియమైనది?)

చెప్పుకోండి చూద్దాం

Friday, February 22, 2008

పేరులోనేమున్నది పెన్నిధి ?

పేరులోనేమున్నది పెన్నిధి అనుకుంటాము గాని, ఏమున్నా లేకపోయినా, కొన్ని పేర్లలో మటుకు గొప్ప చమత్కారం వుంటుంది. సరదాగా కొన్ని జనావాసాల పేర్లు, కొన్ని వస్తువుల పేర్లు ముందుంచుతాను. ఆయా ప్రాంతాలలో వుండి చదువుకునేటప్పుదు, తోటి పిల్లల సహవాసం లో విన్నవీ, సేకరించినవీ, ఇంకా ఙ్ఞాపకమున్నవీ ఈ కొన్ని. ఇవేవీ నా సొంతం కావు.

1.
స్టోనుహౌసు పేట

నెల్లూరులో స్టోనుహౌసు పేట అనే చోటు వుంది. ఆ ప్రాంతమంతా ఎరువులూ, పప్పు దినుసుల టోకు వ్యాపార కేంద్రం కావడంతో బాటు, వణిక్ప్రముఖుల ఆవాసమూనూ. మనుమసిద్ధి మహారాజావారు గట్టి రాతి భవనాలు నిర్మించి వుంటారనీ, ఆంగ్లేయుల కాలంలో ఈ చోటు నామ రూపాంతరం చెంది స్టోనుహౌసు పేట గా మారి వుంటుందనీ చాలా మంది నాకు చెప్పేవారు. కానీ, మచ్చుకైనా ఓ రాతి కట్టడమో, లేక దాని శిధిలమో కూడా ఎక్కడా కనిపించలేదు. పోనీలే, భూమిలో కప్పబడిపోయి వుంటాయి అనుకుంటే, పేరుని సగం మాత్రమే అనువదించి "పేట" అనే తెలుగు మాట ని ఎందుకు వదిలేసెరు అనే సందేహం నన్ను పీడిస్తూ వుండేది. తిక్కన మీది గౌరవమనో, మొల్లమ్మకి పురస్కారమనో కొంతమందంటే, మరింత ముందుకెళ్లి కొందరు శ్రీ పొట్టి గారి సంస్మరణార్ధమనేమోనని వివరించేవారు. చివరకు తేలిందేమిటంటే, శ్రీమాన్ స్టోనుహౌసు వారు నెల్లూరు జిల్లాకి ఆంగ్లేయుల హయాం లో కలెక్టరుగా చేసి, ఎనలేని సేవలందించిన కారణంగా వారిని నిత్యం తలచుకునేటట్లు ఆయన పేరుని పెట్టేరు.

2.
తిరుమల తిరుపతి


అష్ట కష్టాలుబడి, కొండెక్కి, గుండు చేయించుకుని, వెంకన్న బాబుని దర్శించి, ఎండన బడి, సూర్య తాపాన్ని నిగ్రహించడం కోసం తలకి ఓ రుమాలు చుట్టుకుని కాలి దారిన కొండ దిగే యాత్రికులని చూసేవుంటారుగదా! నుదుటి మీదనుంచి గుండు మీదికి పంగనామం పెట్టి డబ్బులు వడుక్కునేవాళ్లని ఎవరెరుగరు? ముందొకడు బొట్టుపెట్టే మిష మీద "తీ రుమాలు" అంటాడు. వాడు చందనం అద్దేక ఇంకొకడు తీక్షణంగా "తీ రూపాయి తీ" అనేవాడట. క్రమంగా ఈ పేర్లు జనం నాలుకల మీద నాని, నాని తిరుమల తిరుపతి గా రూపాంతరం చెందేయని హాస్య పురాణాల్లొ చెప్పేరు.

3.
చపాతీ

మునీశ్వరులవారు, జనానికి దూరంగా ఓ అడవిలో చెట్టుకింద కఠోర తపస్సులో నిమగ్నమయ్యేరు. ఆ అడవిలో వుండే ఓ కోయజాతి బాలుడు రోజూ ఏదో వస్తువు తెచ్చి స్వామి వారికి నివేదించే వాడు. దీని వల్ల ముని గారికి కించిత్తు ఏకాంతభంగం కలిగినా, తననెవరూ పలకరించి, మాటాడించలేదుగదా అని సరిపెట్టుకున్నారు. ఒకసారి ఆ కోయజాతి వారికి కొన్ని గోధుమ గింజలు దొరగ్గా, వాటిని, విసిరి, ముద్ద చేసి, పొయ్యి మీద కాల్చగా తయారైన పదార్థాన్ని చూసి విస్తు పోయారు. దాన్ని సాములోరికి నివేదించేకే తినాలని నిర్ణయించుకున్నారు. ఆ ఖాద్య వస్తువుని ఏమని పిలవాలో కూడా సాములోర్నే అడగాలనుకున్నారు. వారికేంతెలుసు, మునివర్యులు కఠోర తపస్సు చేస్తూ, మౌన వ్రతం అవలంబిస్తున్నారనీ! మన బాలుడు, సదరు వస్తువుని సాములోరికి నివేదించి, ఆయన ఎప్పుడు కళ్లు తెరిచి చూస్తారా అని అక్కడే కూచున్నాడు.


ఈ పిల్లవాడు నిష్క్రమిస్తే, ఆ పెట్టిందేదో ఆరగించి, తన పనేదో చూసుకోవలని, క్రీగంట గమనించిన మునిగారి ఆశ. సాములోరితో మాటాడందే కదలకూడదని కోయబాలుడి పట్టు. ఎదురు చూసీ, చూసి, పిల్లవాడు, వస్తువుని సాములోరి నాసికా పుటాల దగ్గరకు తీసుకొచ్చేడు. మునీశ్వరులవారు భయపడినదంతా అయ్యింది. తపోభంగం కలగడంతో, అసహనంగా "ఛ, పో, తీ" అని గట్టిగా విసుక్కున్నారు. వెంటనే బాలుడు పరుగు లంకించుకుని, గూడెం చేరుకుని తనవారందరికీ, దీని పేరు సాములోరు " చపోతీ" గా నిర్ణయించేరని చెప్పేడు. కాలక్రమేణా, అదే చపాతీ అయ్యింది.

4.
వాల్తేరు

విశాఖపట్నానికి విశాఖ, వైజాగు, వాల్తేరు అని వివిధ సందర్భాలలో పేర్లు. విశాఖ, వైజాగు- విశాఖపట్నానికి భ్రష్ట రూపాలని తెలిసిపోతుంది. మరి వాల్తేరో? ఆలకించండి.


వాల్టు డిస్నీ మహాశయుడు డిస్నీలేండు నిర్మాణంలో ఉన్నప్పుడు ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కొన్నాడు. భవిష్యత్తంతా అగమ్యగోచరమనిపించి ఎంతో నిరుత్సాహానికి లోనయ్యేడు. ఆ సమయంలో సన్నిహిత మిత్రులొకరు, తిరుపతి వెంకన్న బాబు కి తల నీలాలని ఇస్తానని మొక్కితే సమస్యలు సానుకూలమవుతాయని సలహా ఇచ్చేరు. ఎంతో విశ్వాసంతో వాల్టు డిస్నీ కొండలరేడుకి అలాగే మొక్కేడు. వెనువెంటనే, ఇబ్బందులన్నీ దూదిపింజల్లా తేలిపోయి, పని ఓ కొలిక్కి వచ్చింది. ఎంతో సంతోషించిన వాల్టు డిస్నీ వెంటనే భారతదేశం ప్రయాణం అయ్యేడు. మునుపటి రాజధాని కలకత్తా లో విమానం దిగి, అక్కడ విచారించగా హౌరా - తిరుపతి పేసింజరు ఎక్కివెళ్లమని చెప్పేరు. బహుదూరపు విమాన యానం, దానికి తోడు, దుమ్ము ధూళుల మధ్య బొగ్గింజను బండిలో, అన్ని స్టేషన్లలోనూ ఆగుతూ రైలు ప్రయాణం - ఆయన ఒళ్లు హూనం చేసేయి. ప్రతీ స్టేషనులోనూ టీటీఈ ని తిరుపతి ఎప్పుడొస్తుంది, తిరుపతి ఎప్పుడొస్తుందని పదే పదే అడిగేవాడు. వాల్టు డిస్నీ మహాశయుడి ప్రవర తెలియని టీటీఈ కి , ఒక స్థాయిలో చికాకు నషాళానికి అంటింది. వైజాగు రాగానే "ఇదేనయ్యా, తిరుపతి, దిగు" అని టీటీఈ నమ్మబలికేడు. తిరుపతి రూపురేఖలు ఎరుగని వాల్టు డిస్నీ మహాశయుడు, నిజమని భ్రమించి, దిగి బయటకి వెళ్లి సంపూర్ణ వేణీ సంహారం గావించేడు. అప్పుడు ఏలుతున్న తెల్ల దొరలు, ఇతడిని పరిచయం చేసుకోగా వార్త పొక్కింది. "వాల్టు"(డిస్నీ) తన "హెయిరు" (జుట్టు) ను సమర్పించిన చోటు కాబట్టి, నాటి నుండీ, "వాల్టు హెయిరు" గా ప్రసిద్ధికెక్కింది. కాలక్రమేణా, "వాల్టేరు" గానూ, ఆపైన "వాల్తేరు" గానూ ప్రజలు గుర్తించేరు. సదరు టీటీఈ చేసిన మతిమాలిన పనికి రైల్వే శాఖ క్షమాపణ చెప్పి, విశాఖపట్నం స్టేషను కి వాల్తేరు అని పేరు మార్చేరు. మొన్నీ మధ్య వరకూ, ఇదే పేరు చలామణిలో వుండేది. ఇది తెలిసిన వాల్టు డిస్నీ మహాశయుడు, కళ్లు చెమర్చి, తన పేరుని కూడా "వాల్తేరు డిస్నీ" గా మార్చుకున్నాడంటారు.

Thursday, February 21, 2008

మొదటి టపా

ఇప్పుడే పుట్టిన ఈ బ్లాగు బాలుడికి ఏం పేరు పెడదామా అని ఆలోచించి, "చిన్మయ" అని అందామనుకున్నాను. కానీ, అన్యాపదేశంగా తత్త్వ బోధ చేసినట్టుందేమోననిపించింది. ఇద్దరు ప్రియమైన చెల్లెళ్లకి చిన్నన్నయ్యని కదా, "చిన్నన్నయ్య" అందామనుకున్నాను. పరిధి విస్తృతంగా వుండదేమోనని భయపడి, అక్కడే తిరుగుతూ "చిన్నమయ్య" అని పేరెట్టేను.

మొన్నీ మధ్య ఇంటికొచ్చినప్పుడు, పెద్ద చెల్లెలు నేర్పించిన ఈ తెలుగు లిపే నాకు స్ఫూర్తి. ఈ చెల్లెలి ప్రోద్బలమే ఈ బ్లాగుకి ప్రేరణ. ఒక అన్నా, ఇద్దరు చెల్లెళ్ల మధ్య పెరిగిన నాకు, తెలుగు మాధ్యమంలో చదివిన చదువే తరగని ఇంధనం.

సాహితీ, సాంకేతిక రంగాలలో నా ప్రవేశం స్వల్పాతిస్వల్పం. శూన్యం అనే మాట సరిగా వుంటుంది. అయినా, ఈ బ్లాగు ప్రయాణంలో నాకు తోచిందేదో పంచుకుందామని ఈ ఉడుతా భక్తి ప్రయత్నం. మొత్తమ్మీద నేను సైతం బ్లాగాగ్నికి టపా ఒక్కటి ఆహుతిచ్చానని సంబరంగా వుంది.

ఏ వెలుగులకీ ప్రస్థానం అని తరచి చూసుకుంటూ, ఇప్పటికి సెలవు తీసుకుంటాను.
-చిన్నమయ్య