Thursday, October 2, 2008

ఇతి వార్తాః

చుక్, చుక్, చుక్, చూక్ అని రేడియో మోగిన తరువాత, పొద్దున్న సరిగ్గా ఏడయిందని, ఇంట్లో హడవిడిగా తిరిగే పిన్నలకీ, పెద్దలకీ తెలిసేది. వెంటనే - "ఇయం ఆకాశవాణీ, సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికో బలదేవానంద సాగరాః....." అని వినవచ్చేది.

నాకు సంస్కృత పరిచయం చేసిన గురువు శ్రీ భూవరాహన్ గారు. పీరియడ్ మొదలవ్వగానే, ఆయన నస్యం బిగించి, పిల్లలందరిచేతా అప్పటివరకూ నేర్చుకున్న శ్లోకాలన్నీ వల్లె వేయించే వారు. మేమందరమూ నించుని, చేతులు జోడించి, కంఠతాపెట్టిన శ్లోకాలన్నిటినీ అప్పచెప్పేవాళ్లం. ఆయన కళ్లు మూసుకుని వింటున్నట్టనిపించినప్పటికీ, ఉఛ్ఛారణాదోషాల్ని ఇట్టే పసిగట్టి, చాకుపీసుముక్క తో దోషిని మేలుకొలిపేవారు.

కరార విందేన పదార విందం
ముఖార విందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయంతం
బాలం ముకుందం మనసా స్మరామి

ఈ శ్లోకంలో ముఖ్యంగా రెండో పాదంలో ప్రాస ప్రీతితో కొంతమంది పిల్లలు "ముఖార విందే వినివేశయంతం" అని వల్లె వేసి, గురి తప్పక తగిలే, చాకుపీసు ముక్కలు సంగ్రహించుకునేవారు. ఆయన తిట్లూ విలక్షణంగా వుండేవి. మచ్చుకి "ఒరేయ్, పక్షీ, ఇంకొక తూరి ఆ మాదిరి చదివినావంటే, అర్ధచంద్రాకార ప్రయోగం చేస్తాను" అనేవారు. అంటే, చూపుడు వేలూ, బొటన వేలూ, వెడల్పుగా సాచి, మెడబట్టి బయటకి గెంటేయడమన్నమాట. కానీ, ఎప్పుడూ చెయ్యలేదు.

పై తరగతులకి వెళ్లినా, కింది తరగతుల్లో నేర్చుకున్న శ్లోకాలన్నిటినీ, పీరియడు మొదట్లో అప్పచెప్పాల్సిందే! ఈ అప్పగింతలకి పై తరగతుల్లో ఎక్కువ సమయం పట్టినా, ఆయన పట్టించుకునేవారు కాదు. అది భావి జీవితంలో ఎంత ఉపయోగకారో, ఇంకా ఆ శ్లోకం జ్ఞాపకమున్న నాకిప్పుడు తెలుస్తోంది.

ప్రతీ విషయానికీ ఒక కధ చెప్పేవారు. అందుకే మాకాయన తరగతంటే అంత మోజు. కధలోనే పాఠాన్ని ఇరికించే వారు. ఉదాహరణకి సర్ప (పాము) అన్న మాట గురించి చెబుతూ, చర చర వెళ్లేది అని అర్ధం చెప్పేరు. అచేతనంగా పడి వుండడాన్ని మన్ను తిన్న పాముతో పోలుస్తారు గదా, ఆ భావనని సర్పార్ధంతో ముడి వెయ్యకుండా వుండడానికి కాబోలు ఈ కధ చెప్పుకొచ్చేరు.

నహుషుడు అమరావతిని జయించి, ఇంద్రుడిని తరిమిగొట్టి, శచీదేవి చెయ్యందుకోబోతే, ఆవిడ, సప్తర్షులతో పల్లకీ కట్టించుకుని వస్తే, పరిణయమాడతానన్నదట. కొత్తగా గద్దెనెక్కిన, ఈ ధూర్తుడి మాట కాదనలేక సప్తర్షులు, ఇతగాడిని మోస్తూ, అమరావతికేగుతుండగా, ప్రియసమాగమవిలంబననోపలేక, ఆత్రుతలో, పల్లకిలో కూర్చున్న నహుషుడు, ముందువేపు మోస్తున్న పొట్టి వాడయిన అగస్త్య మహామునిని కాలితో తన్ని, "సర్ప, సర్ప" అంటే తొందరగా వెళ్లు అన్నాడట. కోపించిన ముని "సర్పోభవ" (పామువైపో) అని శపించేరట.

సంస్కృతం నేర్చుకునే పిల్లల్ని మిగతా పిల్లలు "ఇతి వార్తాః" అని హాస్యమాడుతూ వుండేవారు. కానీ, ఈ వార్తలు ఇంతటితో సమాప్తంకాదు. మరో సారి మరి కొన్ని రాస్తాను.

5 comments:

సిరిసిరిమువ్వ said...

బహుకాల దర్శనం.

నాగమురళి said...

విశేషాలన్నీ చాలా బాగున్నాయండీ. ఇంకా రాస్తారని ఆశిస్తాను.

teresa said...

తరువాతి ప్రసారం కోసం ఎదురు చూస్తూ...అభినందనలు.

Padma I. said...

అభినందనలు. గాంధీ జయంతి రోజు "గాంధీపాప" గారి గురించి కూడా రాయమని కోరుతున్నాను.

చిన్నమయ్య said...

@ సిసిము, నాగమురళి, తెరెసా మరియు పద్మ : మీ వ్యాఖ్యలకి కృతజ్ఞుణ్ణి.

నేను పది చదువుతున్నప్పుడు మా సంస్కృతం గురువుగారు శ్రీమతి గాంధీపాప. నాకు గుర్తుండి, ఆవిడ మమ్మల్ని సంస్కృతంలో రాయడానికి, సంభాషించడానికి ఎక్కువ ప్రోత్సహించేవారు.

ఎనిమిదిలో ఉన్నప్పుడు బళ్లో ఓ చిన్న సంస్కృత నాటిక వేసేము. మేఘసందేశం కాదు లెండి. మరోసారి, ఆ విషయం ముచ్చటిస్తాను.